పాయ, గుత్తి వంకాయ, గోంగూర మటన్
పాయ సూప్ మాదిరిగా తయారయ్యే ఘుమఘుమలాడే పాయ టేస్టే వేరని భోజనప్రియులు అంటారు. రాయలసీమ వంటకాల్లో పాయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సీమ వాసులు ఈ వంటకాన్ని ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు.
తయారీ:
స్టవ్‌పై పెట్టిన గిన్నెలో 50గ్రా.ల ఆయిల్, 50గ్రా.ల వెల్లుల్లి, తగినన్ని పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి. అనంతరం అందులో కిలో పొట్టేల్ కాళ్లు , ఒక బ్రెయిన్ వేసి కొంత ఫ్రై చేసి అందులో తగినంత ఉప్పు, పసుపు వేయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ఓ కుక్కర్‌లో వేసి అందులో లీటర్ నీళ్లు పోసి 10 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకబెట్టాలి. తర్వాత స్టవ్‌పై నుంచి తీసి ఆవిరి పోయే వరకు ఆగి కుక్కర్ మూత తీయాలి. ఓ గిన్నెలో ఈ మిశ్రమాన్ని తీసుకొని అందులో కొద్దిగా కొబ్బరిపొడి, ధనియాల పొడి, తగినంత కారం పొడి వేసి స్టవ్‌పై బాగా ఉడకబెడితే పాయ తయారైనట్టే. ఈ పాయను బ్రెడ్ నాన్‌తో కలిసి తింటే రుచి అమోఘంగా ఉంటుంది.
గుత్తి వంకాయ
నోరూరించే గుత్తివంకాయ కూరను అందరూ ఇష్టపడతారు. చవులూరించే ఈ కర్రీని రైస్ లేదా రోటీతో కలిసి తినవచ్చు.
తయారీ:
ముందుగా పెద్దగా ఉండే గుత్తి వంకాయలు కిలో తీసుకోవాలి. అనంతరం మరోగిన్నెలో 200గ్రా.ల పల్లీలు, 100గ్రా.ల కారంపొడి, సరిపోయేంత ఉప్పు తీసుకొని కలపాలి. ఈ పల్లీల మిశ్రమాన్ని మిక్సీలో పౌడర్ చేసుకొని అందులో కొన్ని నీళ్లు కలిపి పేస్ట్‌గా చేసుకోవాలి. ఆ తర్వాత వంకాయలను నాలుగు ముక్కలుగా కోసి వాటిలోకి పల్లీల పేస్ట్‌ను ముద్దగా పెట్టాలి.
ఇక స్టవ్‌పై పెట్టిన గిన్నెలో 100గ్రా.ల ఆయిల్ పోసి అందులో 20గ్రా.ల జీలకర్ర, 20గ్రా.ల ఆవాలు, 50గ్రా.ల ఉల్లిపాయలు, 50గ్రా.ల ధనియాల పొడి, కొన్ని టమోటా ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. కొద్గిగా ఫ్రై అయిన తర్వాత అందులో చిటికెడు పసుపు, ఉప్పు వేసి తగినన్ని మంచినీళ్లు పోయాలి. ఆ తర్వాత అందులో కొంత పల్లీల పొడిని వేసి బాగా ఉడకపెడితే గుత్తి వంకాయ కూర రెడీ అవుతుంది. సర్వ్ చేసే ముందు గుత్తి వంకాయ కూరపై కొద్దిగా కొత్తిమీర చల్లితే కర్రీ మరింత ఘుమఘుమలాడుతుంది.
గోంగూర మటన్
రాయలసీమ వంటకాల్లో గోంగూర మటన్ రుచి అమోఘమని నాన్‌వెజ్ ప్రియులు చెబుతారు. సై్పసీగా,టేస్టీగా ఉండే ఈ కర్రీ ఘుమఘుమలాడుతూ నోరూరిస్తుంది.
తయారీ:
ముందుగా ఓ గిన్నెలో 200గ్రా.ల బాయిల్డ్ మటన్ తీసుకొని అందులో తగినంత ఉప్పు,కారం, ధనియాల పౌడర్ వేసి బాగా కలపాలి. అనంతరం 100గ్రా. గోంగూర, 50 గ్రా.ల ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చీలు, 20గ్రా.ల వెల్లుల్లితో పాటు కొంత కరివేపాకు తీసుకోవాలి. స్టవ్‌పై ఉంచిన గిన్నెలో 50గ్రా.ల ఆయిల్ పోసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చీ, వెల్లుల్లి, కరివేపాకు వేసిన తర్వాత గోంగూర వేసి ఫ్రై చేయాలి. కొంతసేపు తర్వాత ఇందులో మటన్ మిశ్రమాన్ని వేసి మరికొంత సేపు ఫ్రైచేయాలి. ఇందులో కొద్దిగా మంచినీళ్లు పోసి బాగా ఉడకబెడితే గోంగూర మటన్ సిద్దమైనట్టే.
No comments:
Post a Comment